సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఆదిమపూరుషు డచ్యుతు
టైటిల్: ఆదిమపూరుషు డచ్యుతు
పల్లవి:
ఆదిమపూరుషు డచ్యుతు డచలు డనంతు డమలుడు
ఆదిదేవు డీతడేపో హరి శ్రీ వేంకటవిభుడు
ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములో
బైకొనియుండగ నొకవటపత్రములోపలను
చేకొని పవళింపుచు నొకశిశువై వడి దేలాడిన
శ్రీకాంతు డీతడేపో శ్రీవేంకటవిభుడు
అరుదుగ బలిమద మడపగ నాకసమంటిన రూపము
సరగున భూమియంతయు నొకచరణంబున గొలిచి
పరగినపాదాంగుటమున బ్రహ్మాండము నదలించిన
పరమాత్ము డీతడేపో పతివేంకటవిభుడు
క్షీరపయోనిధిలోపల శేషుడు పర్యంకముగా
ధారుణియును సిరియును బాదము లొత్తగను
చేరువ దను బ్రహ్మాదులు సేవింపగ జెలువొందెడి
నారాయణుడితడే వున్నతవేంకటవిభుడు