సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఆఱడిఁబెట్టఁగనేల అతని
టైటిల్: ఆఱడిఁబెట్టఁగనేల అతని
పల్లవి:
ఆఱడిఁబెట్టఁగనేల అతని నింతేసి నీవు
మీఱక బంగారుపీఁటమీఁదఁ గూచుండవే // పల్లవి //
కొంగువట్టి తియ్యనేలే కొసర నేమిటికే
సంగతెఱిఁగిననెరజాణవిభుని
ముంగిట నున్నాఁ డతఁడు మొక్కితే నెఱుకగాదా
రంగుగాఁ దానే వచ్చీ రావే లోపలికి // ఆఱడి //
విన్నపము సేయనేలే వేఁడుకొన నింత యేలే
సన్న దెలిసినయట్టిసరసునికి
కన్నాఁడు నీగుట్టు వేళగాచుటే తగులుగాదా
పన్ని నిన్ను నేలీఁగాని పఱవవే పానుపు // ఆఱడి //
చనవునఁ దిట్టనేలే చవులు చూపఁగనేలే
యెనసినశ్రీ వేంకటేశునెదుట
ననిచి వున్నాఁ డితఁడు నగుటే వుంకువగాదా
తనివి నొందించి యింకాఁ దడవవే కాఁగిట // ఆఱడి //