సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అందరి బ్రదుకులు నాతనివే
టైటిల్: అందరి బ్రదుకులు నాతనివే
పల్లవి:
అందరి బ్రదుకులు నాతనివే
కందువెల్ల శ్రీకాంతునిదే
వేమరు జదివెడి విప్రుల వేదము
సోమకవైరి యశో విభవం
శ్రీమించు నమరుల జీవనమెల్ల సు
ధామ ధనుని సంతత కరుణే
హితవగు నిలలో నీసుఖమెల్లను
దితి సుత దమనుడు దెచ్చినదే
తతి తల్లి దండ్రి తానై కాచిన
రతి ప్రహ్లాద వరదుని కృపే
అలరిన యమరేంద్రాదుల బ్రదుకులు
బలి బంధను కృప బరగినవే
బలసి మునుల యాపదలు వాపుటకు
బలునృప భంజను పరిణతలే
పూని యనాథుల పొందుగ గాచిన
జానకీ విభుని సరసతలే
నానా భూభరణంబులు నందుని
సూనుడు చేసిన సుకృతములే
తలకొని ధర్మము తానై నిలుపుట
కలుష విదూరుని గర్వములే
నిలిచి లోకములు నిలిపిన ఘనుడగు
కలియుగమున వేంకటపతివే