సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అందరికాధారమైన ఆది
టైటిల్: అందరికాధారమైన ఆది
పల్లవి:
అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతుడు
సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు // అందరికాధారమైన //
సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు // అందరికాధారమైన //
పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు // అందరికాధారమైన //