సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
టైటిల్: అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
పల్లవి:
అని యానతిచ్చెఁ గృష్ణుఁ డర్జునునితో
విని యాతని భజించు వివేకమా // పల్లవి //
భూమిలోను చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
దీమసాన మోచేటిదేవుఁడ నేను
కామించి సస్యములు గలిగించి చంద్రుఁడనై
తేమల బండించేటిదేవుఁడ నేను // అని //
దీపనాగ్నినై జీవదేహములయన్నములు
తీపుల నరగించేటిదేవుఁడ నేను
యేపున నిందరిలోనిహృదయములోన నుందు
దీపింతుఁ దలఁపుమరపై దేవుఁడ నేను // అని //
వేదములన్నిటిచేతా వేదాంతవేత్తలచే
ఆది నే నెరఁగఁదగినయాదేవుఁడను
శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటాద్రిమీఁద
పాదైనదేవుడఁను భావించ నేను // అని //