సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిటా జాణవు నీకు నమరు
టైటిల్: అన్నిటా జాణవు నీకు నమరు
పల్లవి:
అన్నిటా జాణవు నీకు నమరు నీజవరాలు
కన్నుల పండుగగాను కంటిమి నేఁ డిపుడు
సేయని సింగారము చెలియ చక్కఁదనము
మోయనిమోపు గట్టిముద్దుఁ జన్నులు
పూయకపూసిన పూఁత పుత్తడి మేనివాసన
పాయనిచుట్టరికము పైకొన్న చెలిమి
గాదెఁ బోసినమణులు కనుచూపు తేటలు
వీదివేసిన వెన్నెల వేడుకనవ్వు
పోదితో విత్తినపైరు పొదిలిన జవ్వనము
పాదుకొన్న మచ్చికలు పరగువలపులు
పుట్టగాఁ బుట్టిన మేలు పోగపు సమేళము
పెట్టెఁ బెట్టిన సొమ్ములు పెనురతులు
యిట్టె శ్రీవేంకటేశ యీ యలమేలుమంగను
నెట్టనఁ గూడితి వీకె నిండిన నిధానము