సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిటికి మూలము శ్రీహరియె
టైటిల్: అన్నిటికి మూలము శ్రీహరియె
పల్లవి:
అన్నిటికి మూలము శ్రీహరియె సుండి
విన్నవార కన్నవార విచారించు కొనుఁడీ
దైవమునుఁ దలఁచక తత్వమును నెఱుఁగక
భావించుధ్యానము బట్టబయలు సుండీ
తోవ దెలుసుకొనక దొడ్డమతస్థుఁడు గాక
కావలెనంటే మోక్షము కలుగదు సుండీ
అతిభక్తి నిలుపక హరిఁ గొనియాడక
వెతకేటి చదువులు వృథా సుండీ
యితరము లుడుగక యిన్నిటిపై రోయక
జితకాముఁడు గాఁబోతే చిక్కదు సుండీ
పాపములు విడువక పరిశుద్ధుఁడు గాక
యేపున జన్మఫల మీడేరదు సుండీ
దాపుగా శ్రీవేంకటేశుదాసుఁడ నంటేఁ గాక
తీపుల బ్రహ్మానందము తిరము గాదు సుండీ