సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిటికిఁ గారణము హరియే
టైటిల్: అన్నిటికిఁ గారణము హరియే
పల్లవి:
అన్నిటికిఁ గారణము హరియే ప్రపన్నులకు
పన్నినలోకులకెల్ల పకృతి కారణము
తలఁపు గారణము తత్వవేత్తలకును
చలము గారణము సంసారులకును
ఫలము గారణము పరమవేదాంతులకు
కలిమి గారణము కర్ములకును
తనయాత్మ గారణము తగినసుజ్ఞానులకు
తనువే కారణము తగ జంతువులకు
ఘనముక్తి గారణము కడగన్నవారికెల్లా
కనకమే కారణము కమ్మినబంధులకు
దేవుఁడు గారణము తెలిసినవారికెల్లా
జీవుఁడు గారణము చిల్లరమనుజులకు
దేవుఁడు వేరే కాఁడు దిక్కు శ్రీవేంకటేశుఁడే
పావన మాతనికృప పరమకారణము