సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: అన్నిటిమూలం బతఁడు
టైటిల్: అన్నిటిమూలం బతఁడు
పల్లవి:
అన్నిటిమూలం బతఁడు
వెన్నునికంటెను వేల్పులు లేరు
పంచభూతముల ప్రపంచమూలము
ముంచినబ్రహ్మకు మూలము
పొంచినజీవులపుట్టుగుమూలము
యెంచఁగ దైవము యితఁడే కాఁడా
వెనుకొని పొగడేటివేదాలమూలము
మునులతపములకు మూలము
ఘనయజ్ఞాదుల కర్మపుమూలము
యెనలేనిదైవ మితఁడే కాఁడా
అగపడి సురలకు నమృతమూలము
ముగురుమూర్తులకు మూలము
నగుశ్రీవేంకటనాథుఁడే మూలము
యెగువలోకపతి యితఁడే కాఁడా