సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అంతటనె వచ్చికాచు
టైటిల్: అంతటనె వచ్చికాచు
పల్లవి:
అంతటనే వచ్చికాచు నాపద్భంధుడు హరి
వంతుకు వాసికి నతనివాడనంటేజాలు ||పల్లవి||
బంతిగట్టినురిపేటి పసురము లెడనెడ
బొంత నొక్కొక్క గవుక వుచ్చుకొన్నట్టు
చెంతల సంసారముసేయునరు డందులోనె
కొంతగొంత హరినాత్మ గొలుచుటే చాలు ||అంత||
వరుస జేదుదినేవాడు యెడ నెడ గొంత
సరవితోడుత దీపు చవిగొన్నట్టు
దురితవిధులు సేసి దుఃఖించుమానవుడు
తరువాత హరిపేరు దలచుటే చాలు ||అంత||
కడు బేదైనవాడు కాలకర్మవశమున
అడుగులోనే నిధాన మటు గన్నట్టు
యెడసి శ్రీవేంకటేశు నెరగక గురువాజ్ఞ
పొడగన్నవానిభక్తి పొడముటే చాలు ||అంత|||