సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అనుచు లోకములెల్ల
టైటిల్: అనుచు లోకములెల్ల
పల్లవి:
అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా // పల్లవి //
అదివో కోనేటిలోన నదివో సర్వతీర్థములు
అదివో పైఁడిమేడలహరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరము లిచ్చె నిందిరానాథుఁడు // అను //
అదివో వేదఘోషము అదివో సురలమూఁక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనెఁ బుణ్యములు కోట్లసంఖ్యలు చేరె
యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు // అను //
అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్‍మంగ
అదివో నిత్య శూరులు ఆళువారలు
నిదులశేషాచలము నిక్కి పైఁ బొడచూపె
యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు // అను //