సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: భావించరే చెలులాల పరమాత్మునీ
టైటిల్: భావించరే చెలులాల పరమాత్మునీ
పల్లవి:
భావించరే చెలులాల పరమాత్ముని
చేవదేరి చిగురులో చెఁగయై యుండెను
మలసి పన్నీట హరి మజ్జనమాడేవేళ
కలశాబ్ధిఁదేలేమాణికమువలె నుండెను
అలరి కప్పురకాపు అవధరించేటివేళ
మొలచినవెన్నెల మొలకయై యుండెను
అంచలఁ దట్టుపుణుఁగు అవధరించేటివేళ
యెంచ నంజనాద్రిపై యేనుగై వుండెను
మించినహారములెల్ల మేన నించుకొన్నవేళ
మంచి మంచి నక్షత్రమండలమై యుండెను
వున్నతి నలమేల్మంగ నురముననుంచువేళ
పెన్నిధై పూచినట్టి సంపెంగవలె నుండెను
విన్నె శ్రీవేంకటేశుఁడు వరములిచ్చేటివేళ
తిన్ననై యందరిభాగ్యదేవతై యుండెను