సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఇంతే మరేమిలేదు
టైటిల్: ఇంతే మరేమిలేదు
పల్లవి:
ఇంతే మరేమిలేదు యిందుమీదను
దొంతులకర్మాలు దుమ్ముదూరుపెత్తుట ||
వుల్లములో నుండి దేహమొగి రక్షించేహారి
నొల్లకున్న తన్ను దానొల్లకుండుట
బల్లిదు డతని మానిపరుల వేడేదెల్లా
పొల్లకట్టు దంచిదంచి పోగుసేసుకొనుట ||
యెయ్యెడా బుణ్యఫలము లేమి గలిగిన హరి
కియ్యకున్న నది దైవమియ్యకుండుట
చెయ్యార నాతని కొప్పుసేయని భోగములెల్లా
చయ్యన జెరకుబిప్పి చవిగొనుట ||
శ్రీకాంతుడైనట్టి శ్రీవేంకటేశ్వరుని
జేకొంటె సిరులెల్లా జేకొనుట
మేకులశ్రీహరినామమే నోరనుడుగుట
కైకొన్న యమృతపుగందు వగుట ||