సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మేలుకో శృంగారరాయ
టైటిల్: మేలుకో శృంగారరాయ
పల్లవి:
మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ||
సందడిచే గోపికల జవ్వనవనములోన
కందువందిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ||
గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నుల గలువల-
కితమై పొడిమిన నా యిందు బింబమ ||
వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై
నిరతి వాలిన నా నీలమేఘమా
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా ||